4 వారాల్లో కోర్టు ఉత్తర్వులు అమలు చేయాల్సిందే  : హైకోర్టు

4 వారాల్లో కోర్టు ఉత్తర్వులు అమలు చేయాల్సిందే  : హైకోర్టు
  •     అమలు నివేదిక సమర్పించకపోతే హాజరుకావాల్సిందేనన్న న్యాయస్థానం

హైదరాబాద్, వెలుగు: గిరిజన సంక్షేమ కార్యాలయంలో ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి 2019లో ఇచ్చిన ఉత్తర్వులను 4 వారాల్లో అమలు చేయాలని హైకోర్టు చివరగా అధికారులకు ఓ అవకాశం ఇచ్చింది. నవంబరు 23లోగా అమలు నివేదికను దాఖలు చేయకపోతే ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌‌‌‌ సంతోష్‌‌‌‌లు తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.  గిరిజన సంక్షేమ శాఖలో 5 ఏండ్ల సర్వీసు పూర్తయినప్పటి నుంచి క్రమబద్ధీకరణ అమలు చేసేలా ఆదేశాలివ్వాలంటూ వరంగల్‌‌‌‌ గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న యాకూబ్‌‌‌‌ సహా మరో 11 మంది హైకోర్టులో పిటిషన్‌‌‌‌ వేశారు.

దీనిని విచారించిన హైకోర్టు 8 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని 2019లో ఆదేశాలిచ్చినా అమలు చేయకపోవడంతో 2021లో కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌ టి. మాధవీదేవి సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. గిరిజన సంక్షేమ శాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. దీనికి సంబంధించిన ఫైలును ఆర్థిక శాఖకు పంపామని తెలిపారు. అయితే, ఆర్థిక శాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈఫైలు ఇంకా అందలేదని చెప్పారు.

దీనిపై నిర్ణయం తీసుకోవడానికి 4 వారాల గడువు కావాలంటూ గత ఆదేశాల మేరకు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో హాజరైన ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్, వ్యక్తిగతంగా హాజరైన గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌‌‌‌ సంతోష్‌‌‌‌లు కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి చివరగా 4 వారాల గడువు మంజూరు చేస్తున్నామని, లేదంటే సోమవారం హాజరైన అధికారులు ఇద్దరూ నవంబరు 23న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.